- ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం
- సజీవ ప్రయోగశాలగా నగరం
- జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఒక బెంచ్‌మార్క్ కానుందని జీడబ్ల్యూఎంసీ మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భం గా మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రముఖ జాతీయ పరిశోధన విధాన సంస్థలతో మార్గదర్శక సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు.
అందులో భాగంగా ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఐఐటి మద్రాస్, శ్రీ రామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వారి భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. వ్యర్థాలతో మొదలయ్యే వాతావరణ ప్రతికూలతలను తగ్గింపే లక్ష్యమన్నారు. ముఖ్యంగా బహిరంగంగా నిర్వహించే డంప్‌సైట్‌లు, వ్యర్థాల నుంచి ఉత్పన్నమయ్యే విషపూరిత వాయువులను నిరోధించాలన్నారు. తద్వారా ప్రజల్లో మెరుగైన కాలుష్య రహిత, ఆరోగ్య సహకారాన్ని పెంపొందించనున్నామన్నారు. అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు కణ పదార్థాలతో కూడిన విష తుల్యపదార్థాలు మానవ ఆరోగ్యానికి, వాతావరణ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని వివరించారు. సదరు సంస్థల భాగస్వామ్యం ద్వారా, వరంగల్ నగరం లో స్థిరమైన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ ఆరోగ్య పర్యవేక్షణకు ఒక సజీవ ప్రయోగశాలగా మారడం ఖాయమన్నారు.
వరంగల్ నగరం ఇతర పట్టణ స్థానిక సంస్థలకు స్ఫూర్తి గా నిలువనుందన్నారు. స్థిరమైన పట్టణ నిర్వహణ పట్ల నిబద్ధత, పౌరుల ఆరోగ్యకరమైన, వాతావరణ-స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఈ సంస్థ కార్పొరేషన్ కు సంపూర్ణ సహకారం అందించనుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు సంస్థ చేపట్టబోయే కార్యక్రమ వివరాలను ప్రిన్సిపల్ సైంటిస్ట్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం హెచ్ వో రాజారెడ్డి, ఎస్ ఈ సత్యనారాయణ, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్, డాక్టర్ రాజేష్, ఏసీపీలు ఖలీల్, ప్రశాంత్, రజిత, శ్రీనివాస్ రెడ్డి, ఈఈ లు రవి కుమార్, మహేందర్, సంతోష్ బాబు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రతిభ గణేశన్ తదితరులు పాల్గొన్నారు.


