- హన్మకొండలో వందేళ్ల తర్వాత అత్యంత భారీ వర్షం
- బుధవారం ఏకధాటిగా 15 గంటల పాటు వర్షం
- ఏకంగా 39 సెం.మీ వర్షపాతం నమోదు
- గణాంకాలు వెల్లడించిన వాతావరణశాఖ
- 1903లో ఇంతటి భారీ వర్షం నమోదైనట్లు వెల్లడి
- భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలం
- జల దిగ్జంధంలోనే ఓరుగల్లు మహానగరం విలవిల
- చెరువులను తలపిస్తున్న వందలాది కాలనీలు
- రంగంలోకి విపత్తు నిర్వహణ సిబ్బంది
- లోతట్టు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
- పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు
- బాధితులకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు
- ముంపు ప్రాంతాల్లో కలెక్టర్లు, సీపీ, అధికారుల పర్యటన

కాకతీయ, తెలంగాణ బ్యూరో/ వరంగల్ : మోంథా తుఫాన్ దెబ్బకు గతంలో ఉన్న వర్షపాతం రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దంచికొట్టిన భారీ వర్షం వందేళ్ళ రికార్డును తిరగరాసింది. 1903 తర్వాత హనుమకొండలో మళ్లీ అంతటి వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. 12 నుంచి 15 గంటల్లోనే ఏకధాటిగా కురిసిన వర్షం 39 సెంటీమీటర్లకుపైగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ నెలలో కురిసిన వర్షాల్లో బుధవారం హనుమకొండలో పడినదే అత్యధిక వర్షపాతం అని చెబుతున్నారు. అక్టోబర్ నెలలో ఎప్పుడూ ఇంత వర్షపాతం నమోదైనట్లు ఘనాంకాల్లో లేదని పేర్కొన్నారు. అదేవిధంగా హన్మకొండతోపాటు వరంగల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లోని 11 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదవడం గమనార్హం. అదేవిధంగా రాష్ట్రంలో 30 చోట్ల అతిభారీ వర్షాలు కురిశాయి. 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు నమోదైంది. 46 చోట్ల 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు, 123 చోట్ల 2నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
జలదిగ్బంధంలో వరంగల్












మోంథా తుఫాన్ ధాటికి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వందలాది కాలనీలో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సంతోషమాత కాలనీ, డీకే నగర్, ఎస్ ఆర్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో స్థానికులు ఇళ్లపైకెక్కి సహాయక చర్యల కోసం ఎదురు చూశారు. ఎన్ డి ఆర్ ఎఫ్, రెస్క్యూ టీంలు బోట్ల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు తలదాచుకున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది. వరదల్లో చిక్కుకున్న బాధితులకు డ్రోన్ల సాయంతో ఆహారపొట్లాలు, తాగునీరు అందజేశారు.
హన్మకొండలో నీట మునిగిన కాలనీలు



వరంగల్ నగరంతో పాటు హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి, వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసే హంటర్ రోడ్డు పూర్తిగా జలమయమైంది. బొంది వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతోంది. దీంతో జవహర్ నగర్ కాలనీ, గోపాల్‌పూర్, 100 ఫీట్ల రోడ్డు పూర్తిగా నీటమునిగాయి. కాజీపేట నుంచి హనుమకొండ మార్గంలోని సోమిడి, గోపాల్‌పూర్ చెరువు నిండిపోవడంతో కట్టలు తెగాయి. భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు స్తంభించాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో బైక్‌లు, కార్లు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
ఆందోళన వద్దు.. అండగా ఉంటాం : కొండా సురేఖ
వరంగల్, హన్మకొండ పరిధిలోని వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరంగల్ ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్ ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి క్షేత్రస్థాయిలో వరద ముంపు ప్రాంతాలు పరిశీలించారు. బాధితులను పరామర్శించి, కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా మంత్రి సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని బాధితులకు మంత్రి కొండా సురేఖ భరోసా కల్పించారు.
బాధితులకు ఎంపీ కావ్య భరోసా..
వరద ప్రభావిత ప్రాంతాల్లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విస్తృతంగా పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ బోటులో లోతట్టు ప్రాంతాలకు చేరుకుని పాల ప్యాకెట్లు, తాగునీరు, ఆహారాన్ని స్వయంగా అందజేశారు. వరద ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ విధానాన్ని పరిశీలించారు. గోపాలపురం ప్రాంతంలో వరద ఉధృతి తీవ్రతను గమనించిన ఎంపీ వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్ బీఆర్ నగర్ కాలనీ వరద ప్రభావిత ప్రాంతాన్ని కావ్య స్వయంగా పర్యవేక్షించారు. అక్కడ డ్రోన్‌ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ జరుగుతున్న విధానాన్ని మంత్రి కొండ సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలిసి పరిశీలించారు. ప్రతి కుటుంబానికి సహాయం వేగంగా చేరేలా అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని ఎంపీ భరోసా ఇచ్చారు.
473 విద్యార్థినులను రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు
హంటర్ రోడ్‌లోని జ్యోతిరావు పూలే డిగ్రీ కాలేజీలో వరదల్లో చిక్కుకున్న 473 బాలికలను ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈసందర్భంగా హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్, కాజీపేట తహసీల్దార్ భావ్‌సింగ్ విద్యార్థినులకు అల్పాహారం, తాగునీరు అందించారు. అదేవిధంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వేగంగా స్పందించి బాధితులకు అండగా నిలచారు. వరదల్లో చిక్కుకున్న వాళ్లను స్వయంగా రక్షించి మానవత్వం చాటుకున్నారు.
ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ
తుఫాన్ దాటికి అతలాకుతలమైన హనుమకొండ నగరంలోని ముంపు ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహ నిర్బంధమైన ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.


