వరంగల్’ కు జల సంచాయ్-జన్ భాగీదారి అవార్డు
దక్షిణ భారతంలో జల సంరక్షణ కేటగిరీ- 2 లో జిల్లాకు ప్రథమ స్థానం
న్యూఢిల్లీలో అవార్డు స్వీకరించిన కలెక్టర్ సత్య శారద
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: జాతీయ వేదికపై వరంగల్ జిల్లా ఖ్యాతి విరాజిల్లింది. వరంగల్ జిల్లాకు జల అవార్డుల్లో భాగంగా, జల సంచాయి-జన్ భాగీదారి అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం జల్ శక్తి అభియాన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024-2025 సంవత్సరానికి సంబంధించి “జల సంచాయ్ -జన్ భాగీదారి 1.0” అవార్డు కు దక్షిణ భారత దేశం లో జల సంరక్షణ కేటగిరీ- 2 లో వరంగల్ జిల్లా కు తొలి స్థానం దక్కడంతో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమం లో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ చేతుల మీదుగా కలెక్టర్ డా.సత్య శారద అవార్డు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు జలసంచాయ్-జన్ బాగీదారిలో తొలి స్థానం దక్కడంతో పాటు అవార్డు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధికారుల సమష్టి కృషి, ప్రజల విలువైన భాగస్వామ్యంతో ఈ ఘనత సాధ్యమైందని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ పనులను జిల్లాలోని ప్రజల భాగస్వామ్యంతో42,342 ఇంకుడు గుంతలు, 8,013 సేద్యపు కుంటలు, 260 చేప పిల్లల పెంపకం కుంటలు, మట్టి కట్టలు, రాక్ పిల్ డ్యామ్ లు, కాంటూరు కందకాలు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులు, బోరు బావుల పునరుద్దరణ పనులు, ఫీడర్ కాలువలు, చెక్ డ్యామ్ లు, గ్రామాలలో బోరు బావుల వద్ద వృథా గా పోయే నీటిని భూమిలోకి ఇంకే రీఛార్జ్ పిట్ లు ఏర్పాటు చేయించామని తెలిపారు. రైతుల భూములలో డ్రిప్ ఇరిగేషన్, అటవీ భూములలో కందకాలు, చిన్న ఊట కుంటలు మొదలైన నీటి సంరక్షణ పనులను చేశారని, ఈ నీటి సంరక్షణ పనులతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఈ అవార్డుతో పాటు జిల్లాకు రూ.కోటి రూపాయల నగదు కూడా దక్కిందని చెప్పారు. అవార్డు రావడానికి కృషిచేసిన అధికారులకు, సహకరించిన ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.


