వరంగల్ కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి గుర్తింపు
గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందజేత
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లాకు రాష్ట్రస్థాయి గౌరవం దక్కింది. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ *డా. సత్య శారద*కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా గ్రీన్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వినూత్న ఓటర్ అవగాహన కార్యక్రమాలు, ఓటర్లలో భాగస్వామ్యాన్ని పెంచే చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచినందుకు ఈ అవార్డు వరంగల్ జిల్లాకు లభించింది. ఎన్నికల నిబంధనల అమలు, అధికారుల శిక్షణ, పారదర్శకతకు పెద్దపీట వేయడం కూడా ప్రశంసలకు కారణమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసిందని అధికారులు ప్రశంసించారు. కలెక్టర్ డా. సత్య శారదకు జిల్లా అధికారులు, సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


