డ్రైనేజీలోంచి నడుకుంటూ వె|ళ్లి నామినేషన్
కరీంనగర్‌లో అభ్యర్థి కోట శ్యామ్‌కుమార్ వినూత్న నిరసన
కాకతీయ, కరీంనగర్ : సాధారణంగా అభ్యర్థులు గుడిలో మొక్కి నామినేషన్ దాఖలు చేసే దృశ్యాలు చూస్తుంటాం. కానీ కరీంనగర్‌లో మాత్రం అందుకు భిన్నమైన ప్రజల దృష్టిని ఆకర్షించిన ఘటన చోటుచేసుకుంది. డ్రైనేజీ సమస్యలతో నిత్యం ఇబ్బందులు పడుతున్న కాలనీల పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపిస్తూ డ్రైనేజీ బురదలో నుంచి నడుచుకుంటూ వచ్చి నామినేషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ మునిసిపాలిటీ పరిధిలోని 21వ డివిజన్‌కు చెందిన అభ్యర్థి కోట శ్యామ్‌కుమార్ ఈ వినూత్న నిరసనతో నామినేషన్ దాఖలు చేశారు. డివిజన్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, మౌలిక వసతుల లోపాలను ప్రజల ముందు ప్రత్యక్షంగా చూపించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కోట శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ కరీంనగర్‌లోని 66 డివిజన్లలో ఎవరైనా గెలిస్తే ఒక కార్పొరేటర్ గెలిచాడని అంటారు. కానీ 21వ డివిజన్‌లో నేను గెలిస్తే రాష్ట్రం మొత్తం ఒక నాయకుడు గెలిచాడని చెప్పుకునేలా పనిచేస్తాను అని అన్నారు. కాలనీ వాసులు విజ్ఞతతో ఆలోచించి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 21వ డివిజన్‌ను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి చేసి డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. డ్రైనేజీ బురద నుంచే తన పోరాటం ప్రారంభమైందని ప్రజల సమస్యలే తన రాజకీయ అజెండా అని శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు.


