దాతల సాయం కోసం ఎదురుచూపు!
పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు
ఆపరేషన్‌కు లక్ష రూపాయలు అవసరం
మంచానికే పరిమితమైన తల్లి పరిస్థితి దయనీయం
కాకతీయ, కారేపల్లి : విధి వరుసగా పరీక్షిస్తున్నా తలవంచని ఓ నిరుపేద యువకుడు ఇప్పుడు దాతల కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. సింగరేణి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన చింత రమేష్ పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అతని తల్లి కూడా నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. అయినా కుటుంబాన్ని పోషించాలనే పట్టుదలతో రమేష్ ప్రతిరోజూ కష్టపడి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రమేష్‌కు తీవ్రమైన మధుమేహం సోకింది. ఇప్పటికే ఒక కాలు సరిగా లేకపోయినా, ఇప్పుడు మరో కాలుకు ఇన్ఫెక్షన్ రావడంతో వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఈ చికిత్సకు సుమారు లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. పనికి వెళ్లలేక ఇంటికే పరిమితమైన రమేష్ ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయాడు.
కుటుంబం ఆవేదన
రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబానికి ఇంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం అసాధ్యంగా మారింది. తల్లిని చూసుకోవాలన్నా, తన ప్రాణాన్ని కాపాడుకోవాలన్నా దాతల సాయమే దిక్కని రమేష్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. గ్రామస్తులు కూడా మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న సాయం చేసినా ఒక ప్రాణం నిలుస్తుంది. దాతల సహాయం కోసం ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ఆర్థిక సాయం చేయదలచిన వారు ఈ కింది నంబరులో సంప్రదించవచ్చు.
చింత రమేష్ (Phone Pay): 9949824038


