కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బిహార్ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదని ఈసీ విపక్షాలను హెచ్చరిస్తోంది. ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బిహార్ ఓటర్ల జాబితాలో అనేక మంది బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, అఫ్ఘానిస్తాన్ దేశాలకు చెందినవారి పేర్లు ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ దేశాలకు చెందిన అనేక మంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా కూడా ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది.
ఇలా అవకతవకలకు పాల్పడిన దాదాపు 3లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వీటిపై ఆగస్టు 1 నుంచి పరిశీలన మొదలైందని..ఇది సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. ఓటర్ల జాబితాలో మార్పులు కోరుతూ గురువారం నాటికి లక్షా 95వేల దరఖాస్తులు అందిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో 24, 991 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు వెల్లడించింది.
అఫ్టానిస్తాన్ కు చెందిన ఇమ్రాన్ ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే ఇద్దరు మహిళలకు కూడా బీహార్ లో ఓటరు కార్డులు జారీ అయినట్లు గుర్తించామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ విషయంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. అనర్హులు, ఫేక్ ఓటర్లతోపాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20సంవత్సరాల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
ముస్లింలు, వలస కార్మికులు, దళితులను ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే కేంద్రం చెప్పినట్లు ఈసీ ఈ వ్యూహాన్ని అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత్రుత్వంలోని ఇండియా బ్లాక్ ఆరోపిస్తుంది. ఈ విషయంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని పేర్కొంది. అయితే ఎన్నికల సంఘం ఎంచుకున్న సమయాన్ని మాత్రం ప్రశ్నించింది.


