కాకతీయ, గీసుగొండ: గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను సరిచూసుకొని అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఇన్చార్జి ఎంపీడీవో పాక శ్రీనివాస్ అన్నారు.మండల పరిషత్ కార్యాలయంతో పాటు మండలంలోని 21 గ్రామాల్లో ఫోటోతో కూడిన ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం పంచాయితీ కార్యదర్శులు గ్రామ నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్టు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వార్డుల వారీగా జాబితాలో ఎవరైనా అభ్యంతరాలు తెలపదలచిన పక్షంలో ఈ నెల 30వ తేదీ వరకు తెలియజేయాలని ఆయన సూచించారు. అదే రోజున మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి అనుమతితో సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ల జాబితాను గ్రామాల్లో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం గీసుగొండ మండలంలో మొత్తం 28,908 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీడిఓ వివరించారు. వీరిలో పురుషులు 13,979, స్త్రీలు 14,928, థర్డ్ జెండర్ కు చెందిన వారు ఒకరు ఉన్నారని తెలిపారు.


