ఓటెత్తారు…!
ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు
పెరిగిన మునిసిపల్ ఎన్నికల పోలింగ్ శాతం
ఏ కేంద్రంలో చూసినా భారీగా క్యూలైన్లు
అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు
ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
ఓటింగ్ రోజు కొనసాగిన డబ్బుల పంపిణి
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది. జనగామ నుంచి వరంగల్ వరకు అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ తదితర 12 మున్సిపాలిటీల పరిధిలో 260కుపైగా వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా సాగింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు కనిపించాయి. యువత, మహిళలు, వృద్ధులు అన్నివర్గాల వారు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ మధ్య ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు విజయవంతంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.

జనగామ జిల్లాలో భారీ స్పందన
జనగామ జిల్లాలో ఓటర్లు భారీగా తరలిరావడంతో మొత్తం 80.66 శాతం పోలింగ్ నమోదైంది. జనగామ మున్సిపాలిటీలో 79.06 శాతం, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో 84.47 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. గంటలవారీగా పోలింగ్ శాతం క్రమంగా పెరిగింది. ప్రజల్లో నెలకొన్న చైతన్యమే ఈ భారీ స్పందనకు కారణమని అధికారులు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 78.90 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 98 వార్డులు, 193 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగ్గా 1,27,682 మంది ఓటర్లలో 1,00,744 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపాలిటీల వారీగా చూస్తే – మరిపెడలో 85.36%, కేసముద్రంలో 86.14%, డోర్నకల్‌లో 81.88%, తొర్రూరులో 77.99%, మహబూబాబాద్‌లో 75.60% పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం అధికంగా కనిపించింది.

పరకాలలో 80.16 శాతం
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 80.16 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 26,784 మంది ఓటర్లలో 21,469 మంది ఓటు వేశారు. 44 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించగా, సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. 100 శాతం వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను అధికారులు పర్యవేక్షించారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో 65.18 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 34,367 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేకంగా కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయి
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. నర్సంపేటలో 85.21 శాతం, వర్ధన్నపేటలో 86.23 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై కేంద్రీకృతమైంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుండగా, అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఎక్కడ ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి.
మున్సిపాలిటీల వారీగా పోలింగ్ శాతం
మున్సిపాలిటీ పోలింగ్ శాతం
జనగామ 79.06%
స్టేషన్ ఘన్‌పూర్ 84.47%
మరిపెడ 85.36%
కేసముద్రం 86.14%
డోర్నకల్ 81.88%
తొర్రూరు 77.99%
మహబూబాబాద్ 75.60%
పరకాల 80.16%
భూపాలపల్లి 65.18%
ములుగు 80.41%
నర్సంపేట 85.21%
వర్ధన్నపేట 86.23%


