- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- విధుల నుండి రొంపికుంట పంచాయతీ కార్యదర్శి తొలగింపు
కాకతీయ, పెద్దపల్లి : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వమని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. బుధవారం కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామం జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం. తిరుపతిని విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారధి సొసైటీ ద్వారా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తిరుపతి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అధికారులు, ఆరోపణలు నిజమని తేల్చారు. దీనిపై కలెక్టర్ వెంటనే ఆయనను సేవల నుండి తొలగించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, పథకం అమలులో ఎటువంటి అవకతవకలు సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.


