గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
పల్లెల్లో గత కాంగ్రెస్ ప్రభుత్వ మార్క్ కనపడాలి
సమస్యల పరిష్కారానికి సర్పంచులే వారధులు
అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తాం
ఆదర్శవంతమైన పాలన కొనసాగించాలి
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్
కాకతీయ, హుజురాబాద్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి వారధులుగా గ్రామ సర్పంచులు పనిచేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సూచించారు. ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల గ్రామాల్లో నూతనంగా కొలువుదిరిన గ్రామ పంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి అభినందనలు స్వీకరించారు.
సమస్యలు తెలియజేస్తే నిధులు తెస్తా
అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచులకు సూచించారు. ఈ ప్రాంత బిడ్డగా తన దృష్టికి సమస్యలు తీసుకొస్తే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన మేరకు నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తుచేశారు. అదే తరహాలో పల్లెల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ముద్ర కనిపించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు చేరువగా ఉంటూ, పారదర్శకంగా పాలన సాగించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతన సర్పంచులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


