వీధి కుక్కల వైరస్ భయం.. గ్రామస్తుల్లో ఆందోళన
బొచ్చు ఊడిపోవడం, గాయాలతో సంచారం..
పిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు
గ్రామపంచాయతీ, పశువైద్యశాఖ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో వీధి కుక్కలకు వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని గల్లీలలో బొచ్చు పూర్తిగా ఊడిపోయి, శరీరంపై గాయాలతో తిరుగుతున్న కుక్కలు కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఒకే ప్రాంతంలో పలుచోట్ల ఇలాంటి కుక్కలు కనిపించడం స్థానికులను కలవరపెడుతోంది.
అసహజ ప్రవర్తన.. బయటకు వెళ్లేందుకు భయం
స్థానికుల కథనం ప్రకారం, ఈ కుక్కలు అనారోగ్యంగా కనిపించడమే కాకుండా కొన్నిసార్లు అసహజంగా ప్రవర్తిస్తున్నాయి. దీంతో పిల్లలను బయట ఆడుకోవడానికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. బొచ్చు ఊడిపోవడం, గాయాలు కనిపించడం వంటి లక్షణాలు వైరస్ వ్యాధి లేదా చర్మ సంబంధిత వ్యాధి సంకేతాలుగా భావిస్తున్నారు. రేబీస్ వంటి ప్రమాదకర వ్యాధి అయితే ప్రజలకు ప్రాణహాని కలగొచ్చని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. చర్యల కోసం డిమాండ్
ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులు, పశువైద్యశాఖ సిబ్బంది ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే పశువైద్య బృందాన్ని పంపించి కుక్కలను పరీక్షించి, అవసరమైన టీకాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే అనారోగ్య కుక్కలను పట్టుకొని చికిత్స అందించి, వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


