పతాక స్థాయికి పల్లె పోరు
ఓటుకు రూ. 2 వేలు !.. సుక్కా.. ముక్కా అదనం
ప్రత్యర్థులు ఎంతిస్తే అంతకు మించి పంపిణీ
పోల్ మేనేజ్మెంట్పై పార్టీలు బలపర్చిన అభ్యర్థుల దృష్టి
వార్డుల వారీగా అత్యంత సన్నిహితులకు బాధ్యతలు
తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
రేపటి ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
మొత్తం 3836 సర్పంచ్ స్థానాలు… 56,19,430 మంది ఓటర్లు
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : ఈసీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: పల్లె పోరు పతాకస్థాయికి చేరింది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెర తీశారు.ప్రధాన పార్టీల అభ్యర్థులు. వార్డులు, కాలనీలవారీగా బాధ్యులను నియమించి మద్యం, మనీ పంపిణీ ముమ్మరం చేశారు. ప్రత్యర్ధులు ఎంత ఇస్తే అంతకు మించి పంపిణీ చేస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తున్నా కళ్ళు కప్పి గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగం కొనసాగుతోంది. ఈ ఎన్నికలో ప్రతీ ఓటు కీలకం కావడంతో అభ్యర్థులు అత్యధిక మంది మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గాలు, మహిళా, యువ సంఘాలు, వలస ఓటర్ల వారీగా వారి బలాలను లెక్కగట్టుకుంటున్నారు. వారిని ఆకట్టుకునేలా ఎర వేస్తున్నారు. చాలాచోట్ల ఆన్లైన్ యాప్‌లలో ఓటుకు ఇంత అని డబ్బు పంపిణీ చేస్తున్నారు. పోటీ గట్టిగా ఉన్న చోట ఓటుకు రూ.2000 నుంచి రూ.2500 వరకు ఇస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల దీని డిమాండ్ భారీగా పెరిగింది. ఒక కుటుంబంలో ఉన్న ఓట్ల ఆధారంగా రూ.4 నుంచి రూ.5 వేల వరకు పంపిస్తున్నారు. దీనికి తోడు ఇంటింటికీ చికెన్.. మద్యం బాటిళ్లు పంపుతుండటంతో సుక్కా.. ముక్కతో గ్రామాలు ఊగిపోతున్నాయి.
ఆన్లైన్లో ఖాతాలకు మనీ ట్రాన్స్‌ఫర్
గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. నగదు, ఇంటింటికీ మద్యం సీసాల పంపిణీని ప్రారంభించారు. నగరాలు, పట్టణాల్లో ఉండే ఓటర్లకు పలువురు సర్పంచి అభ్యర్థులు వాహన ఏర్పాట్లు, ప్రయాణ ఖర్చులతోపాటు ఓటుకు డబ్బులను ఆన్లైన్లో వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మంగళవారం రాత్రే నుంచే డబ్బు పంపిణీ మొదలైంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చు, పంపిణీ మొత్తాలను కలిపితే రూ.కోటి వరకు చేరుకుంటోంది. నగరాలు, పట్టణాలకు సమీపంలో, భూముల ధరలు భారీగా ఉన్న చోట్ల ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటోంది. మొదటి దశ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఈసీ నిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచే వైన్‌షాపులు మూతపడ్డాయి. 12వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ముందే భారీఎత్తున మద్యం కొనుగోలు చేసి గ్రామాల్లో డంప్‌లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఓటర్లకు ఇంట్లో ఇద్దరు ఉంటే హాఫ్ బాటిల్, అదే నలుగురు ఉంటే ఫుల్ బాటిల్ ఇస్తున్నారు.
విధుల్లో లక్షమంది సిబ్బంది
తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నాయని.. ఈ నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో ఎస్ఈసీ రాణి కుముదిని విలేకర్లతో మాట్లాడుతూ.. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. తొలి దశలో 56,19,430 మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. 3836 సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లతో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల విధుల్లో లక్ష మందికి పైగా సిబ్బంది పాల్గొనున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు 18 రకాల ఐడీ కార్డులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏ రకమైన ఐడీ కార్డును పోలింగ్ బూత్ అధికారులకు చూపించిన ఓటు వేయవచ్చునన్నారు. మంగవారం నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులన్నీ మూసి వేసినట్లు చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మేజిస్ట్రియల్ పవర్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈసీ వివరించారు.



