కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి : మంత్రి సీతక్క
కాకతీయ,నూగూరు వెంకటాపురం: మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడకుల అశోక్‌లతో కలిసి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.
మారుమూల గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అవసరమని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


