కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్‌ను 2047 నాటికి వికసిత్ దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఆ దిశగా యువతలో సృజనాత్మకతను పెంపొందించేందుకు, కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడానికి “వికసిత్ భారత్ పోటీలు” నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ పోటీల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్థాయిలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావచ్చు. వ్యాసరచన, క్విజ్, ఆర్ట్, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు వంటి విభాగాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత భవిష్యత్తు, అభివృద్ధి దిశలో తమ ఆలోచనలను సృజనాత్మక రీతిలో వ్యక్తపరచే వారికి పెద్ద ఎత్తున గుర్తింపు లభించనుంది.
ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కేవలం జాతీయ స్థాయి సత్కారం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మీటింగ్ అవకాశం కూడా దక్కనుంది. దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లడంలో యువత పాత్ర ఎంత ముఖ్యమో ఈ ఆహ్వానం స్పష్టంగా తెలియజేస్తుంది.
పోటీలను వివిధ దశల్లో నిర్వహించనున్నారు. మొదట జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికలు జరగగా, ఆ తరువాత జాతీయ స్థాయిలో తుది పోటీలు ఉంటాయి. ఇందులో గెలిచిన వారు ప్రధానితో నేరుగా తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం పొందుతారు.
ఈ కార్యక్రమం ద్వారా యువతలో జాతీయత భావన, సామాజిక బాధ్యత పెరగడంతో పాటు, అభివృద్ధి దిశలో నూతన ఆలోచనలు వెలువడతాయని కేంద్రం ఆశిస్తోంది. పోటీల్లో గెలిచిన వారికి జనవరి 12వ తేదీన ఢిల్లీలో నిర్వహించే వేడుకల్లో ప్రధాని మోదీని కలిసి చర్చించే ఛాన్స్ దక్కుతుంది. దేశాభివ్రుద్ధి, పురోగతికి అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడతారు.
ఈ పోటీల్లో పాల్గొనాలంటే సెప్టెంబర్ 1 నాటికి 15 నుంచి 29ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఇంగ్లీష్ తోపాటు 12 భారతీయ భాషల్లో ఏదొకటి ఎంచుకోవచ్చు. మై భారత్ వెబ్ సైట్ లో రిజిస్టర్డ్ అయి క్విజ్ లో పాల్గొనవచ్చు. కథలు, కవితలు, పెయింటింగ్, జానపదగాయం, జానపదన్రుత్యం, సైన్స్, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచే పోటీలను నిర్వహిస్తారు.


