
రంగలీల మైదానంలో 70 అడుగుల రావణ ప్రతిమ దహనం
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని ఉర్సు రంగాలీలా మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో మంత్రి కొండ సురేఖ, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కమిషనర్ చాహాత్ బాజ్ పాయి పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ ఆటోమెటిక్ స్విచ్ ఆన్ చేసి రావణ వధ, దసరా వేడుకలను ప్రారంభించారు.

దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మేడిది మధుసూదన్, ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పది తలలతో కూడిన 70 అడుగుల రావణ ప్రతిమ దహన ఘట్టం నేత్రపర్వంగా జరిగింది. మిరుమిట్ల గొలుపే వెలుగుల్లో బాణసంచా పేలుళ్లతో ప్రాంగణమంతా మార్మోగింది. రావణ కార్యక్రమానికి ప్రారంభించే ముందు కరీంబాద్ రామస్వామి గుడి నుండి సీతారామాంజనేయ, లక్ష్మణుడి విగ్రహాలను రథంపై ప్రతిష్టించి వేలాది మంది వెంటరాగా, కోలాటం డప్పు చప్పుళ్ళు, వాయిద్యాలు భజనలు నృత్యాల నడుమ రంగలీల మైదానికి చేరుకున్నారు. అనంతరం షమీ పూజ, పాలపిట్ట దర్శనం నిర్వహించారు.

వేడుకల్లో పేరిణి శివతాండవం, కూచిపూడి నృత్యాలు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, రాణి రుద్రమ్మ, జానపద గేయాలు తెలంగాణ ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతి యువకులు కేరింతలు కొడుతూ సంబరాల్లో మునిగితేలారు. చెడుపై విజయం సాధించిన రోజునే ప్రజలు విజయదశమిగా జరుపుకోవాలని ఆనవాయితీగా వస్తోందని మంత్రి కొండ సురేఖ అన్నారు. వేడుకలకు ప్రారంభించిన మంత్రి దసరా విశిష్టతను గురించి కులంకశంగా వివరించారు.

రంగలీలా మైదానంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం, గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడంపై మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నగర నలుమూలల నుండి వచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం మంత్రి, నగర మేయర్ తో కలసి రంగశాయిపేట, కొత్తవాడ, తోట మైదానం ఆప్రాంతాలలో జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోశాల పద్మ, ముష్కమల్ల అరుణ, జలగం అనిత, స్థానిక ప్రజాప్రతినిధులు, జిడబ్ల్యూఎంసీ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


