ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత అవసరం – కలెక్టర్ దివాకర.
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం నుండి ముగింపు వరకు సాఫీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బంది పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివాకర సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆర్వోలు, ఏఆర్వోలకు ఎన్నికల ప్రక్రియపై మార్గదర్శకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ దాఖలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, లెక్కింపు వంటి ప్రతి దశలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, నిబంధనల మేరకు సాగాలి అని, ఏ ఒక్క పొరపాటు కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని,అందుకే ప్రతి అధికారి ముందుగానే అన్ని విధానాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతున్న నేపథ్యంలో సిబ్బంది తాజా మార్పులపై ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే పై అధికారులను సంప్రదించాలని తెలిపారు. తదుపరి, మాస్టర్ ట్రైనర్లు సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ప్రక్రియపై సమగ్ర శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవ్‌రాజ్, ఆర్వోలు, ఏఆర్వోలు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.


