కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణకు అతి భారీవర్షాలు ఉన్నట్లు వెల్లడించింది భారత వాతావరణ కేంద్రం. తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్రుతంగా ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో మంగళవారం వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ ఐదు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది.


