వేములవాడ అభివృద్ధి మా బాధ్యత
ప్రజాపాలనలో సంక్షేమ–అభివృద్ధి సమతుల్యం
ఆలయ, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి వేములవాడలో ప్రత్యేక పూజలు
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అభివృద్ధి తమ బాధ్యత అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ *ఆది శ్రీనివాస్*తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయని, అనివార్య కారణాలతో 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగడం లేదన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.
ప్రజాపాలనలో అభివృద్ధి వేగం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, పట్టణాభివృద్ధి పనులు వేగంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. గతంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని, గతంలో నెలకు రూ.1000 వరకు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వచ్చేదని, ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, దీని ద్వారా రూ.9 వేల కోట్ల విలువైన ప్రయాణ సదుపాయం ప్రజలకు లభించిందన్నారు.
రైతులు–నిరుద్యోగులపై దృష్టి
రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, సన్నవడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ద్వారా వేగంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. తెలంగాణ విజన్–2047 ద్వారా గ్రామీణ, పట్టణాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. వేములవాడ అభివృద్ధిని కొందరు ఇప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటున్నారని మంత్రి విమర్శించారు. గత 12 ఏళ్లుగా అమృత్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే అమృత్ పేరుతో మాటలు చెప్పడం సరికాదని, అయితే వేములవాడకు అమృత్ వస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వేములవాడ అభివృద్ధిపై ఉద్యమించిందని, అధికారంలోకి రాగానే మొత్తం కేబినెట్‌తో కలిసి ముఖ్యమంత్రి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
విద్యుత్, రవాణా అభివృద్ధి
అప్రకటిత కరెంట్ కోతలపై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని, రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సమస్య లేదన్నారు. వేములవాడ బస్ స్టేషన్ అభివృద్ధి టెండర్ దశలో ఉందని, చందుర్తి బస్ స్టాండ్ అభివృద్ధి కూడా చేపడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని మంత్రి భరోసా ఇచ్చారు. మొత్తానికి, ఆలయ అభివృద్ధి నుంచి పట్టణ మౌలిక వసతుల వరకూ వేములవాడను సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


