వాహనాల అప్పగింత ప్రారంభం
యజమానులు ఆధారాలతో వచ్చి వాహనాలు తీసుకోవాలి
పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు ప్రారంభించినట్లు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వివిధ ఘటనల్లో పట్టుబడిన వాహనాలను హనుమకొండ భీమారం సీఆర్పీఎఫ్ కేంద్రంలో భద్రపరిచినట్లు ఆయన వెల్లడించారు. ఈ వాహనాలను సంబంధిత పోలీస్ స్టేషన్ల వారీగా గుర్తించి, ఆయా యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు. వాహన యజమానులు తగిన ఆధార పత్రాలతో సంబంధిత పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తే, నిబంధనల ప్రకారం వాహనాలను తిరిగి అందజేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. వాహనాల స్వాధీనం విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని, అర్హులైన వారికి త్వరితగతిన అప్పగింపు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజ్, ఎం.టి.ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ (8712685158) లేదా సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మల్లయ్య (8008389789)లను సంప్రదించాలని కమిషనర్ సూచించారు.


