స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో వైభవంగా వసంత పంచమి వేడుకలు
చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవం
కాకతీయ,ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పండితులు చిన్నారులతో కలిసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు మంగళకరంగా నిర్వహించి అనంతరం చిన్నారులకు అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాస క్రతువును జరిపారు. చిన్నారులు తల్లిదండ్రులతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడంతో పాఠశాల పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ చిన్నారులకు ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకల సందర్భంగా అక్షరాభ్యాస ఉత్సవాన్ని తమ పాఠశాలలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పరిసర ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఈ వేడుకల్లో పాల్గొని అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ వసంత పంచమి రోజునే పాఠశాల నూతన సంవత్సర ప్రవేశాలను ప్రారంభించామని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పాఠశాలకు వెన్నుదన్నుగా నిలిచి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు.


