వందేమాతరం స్ఫూర్తిమంత్రం
భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది
జాతీయతా భావనలను పెంపొందించింది
ప్రధాని నరేంద్ర మోదీ
ఘనంగా వందేమాతర గేయం 150 ఏళ్ల స్మారకోత్సవం
కాకతీయ, నేషనల్ డెస్క్ : వందేమాతర గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం, అదొక స్ఫూర్తి మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతర గేయం 150 ఏళ్ల స్మారకోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వందేమాతరం గీతం అనేది దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని మోదీ అన్నారు. ఈ జాతీయ గేయం అందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని, ఆ శబ్దం అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని, వందేమాతరం సామూహిక గీతాలాపన ఒక అద్భుత అనుభవమన్నారు.
ఒకే లయ, స్వరం, భావంతో ..
ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని, వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటాయని, వందేమాతరం మూల భావం భారత్ అని మోదీ చెప్పారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి వందేమాతరం స్ఫూర్తిని అందించిందని తెలిపారు. దేశంలో జాతీయ ఐక్యతను, జాతీయతా భావనలను పెంపొందించడంలో అది కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ ఏడాది నవంబరు 7 నుంచి 2026 సంవత్సరం నవంబరు 7 వరకు దేశవ్యాప్తంగా ‘వందేమాతరం’ స్మారకోత్సవాలు ఘనంగా జరుగుతాయని ప్రధాని వెల్లడించారు. ‘వందేమాతరం’ 150 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా స్మారక స్టాంపు, నాణెంను ఆయన విడుదల చేశారు.
సంకల్పిస్తే సాధించలేనిది లేదు
‘‘వందేమాతర గేయంలోని పదాలు మనల్ని చరిత్ర పుటల్లోకి తీసుకెళ్తాయి. అవి మన వర్తమానాన్ని కొత్త విశ్వాసంతో నింపుతాయి. మన భవిష్యత్తుకు భరోసాను ఇస్తాయి. సంకల్పిస్తే సాధించలేని లక్ష్యమంటూ ఏదీ ఉండదనే ధైర్యాన్ని భారతీయులకు వందేమాతరం ప్రసాదిస్తుంది. నవంబరు 7 ఒక చారిత్రక దినోత్సవం. ఎందుకంటే మనం వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలను ఈరోజే ప్రారంభిస్తున్నాం. దీనికి సంబంధించి నిర్వహించబోయే కార్యక్రమాలు కోట్లాది మంది భారతీయుల్లో కొత్త శక్తిని నింపుతాయి. ఈ గొప్ప సందర్భాన్ని పురస్కరించుకొని నా తరఫున ప్రతీ భారతీయుడికి శుభాకాంక్షలు. వందేమాతర గేయంలోని ఆశయాల సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన లక్షలాది మంది స్వాతంత్య్ర పోరాట యోధులకు నా శ్రద్ధాంజలి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
‘వందేమాతరం’ ఆలపించిన ప్రధాని
ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా సభికులతో కలిసి ప్రధాని మోదీ ‘వందేమాతరం’ పూర్తి గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, దిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాల్లోనూ ‘వందేమాతరం’ పూర్తి గేయాన్ని ఆలపించనున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్న ఈ వేడుకల్లో యువతను పెద్దసంఖ్యలో భాగం చేయనున్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంపై వందేమాతర గేయం ప్రభావాన్ని ప్రజలకు తెలియజేయనున్నారు.


