తరతరాలకు ఆదర్శం వాజ్‌పేయి జీవితం
బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి
కాకతీయ, ఖమ్మం : మాజీ ప్రధాని, భారతరత్న దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం తరతరాలకు ఆదర్శంగా నిలిచిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జ్యేష్ఠ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు దుద్దుకూరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మందడపు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 107 మంది జ్యేష్ఠ కార్యకర్తలను గుర్తించి శాలువాలు, మెమెంటోలు అందజేశారు.
దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పాలన
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా వాజ్‌పేయి దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నారు. అజాతశత్రువుగా గుర్తింపు పొందిన నాయకుడిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కుటుంబ రాజకీయాలు పెరిగాయని, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు నేడు కమర్షియల్ పార్టీలుగా మారాయని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, ప్రముఖ కవి అయ్యగారు ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు వడ్లమూడి సురేష్, మల్లెంపాటి రమేష్, గుత్తా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


