అసాధారణ నాయకుడు వాజ్‌పేయి
బీజేపీ సీనియర్ నాయకుడు గందే నవీన్
28వ డివిజన్‌లో అటల్ 101వ జయంతి వేడుకలు
కాకతీయ, వరంగల్ సిటీ : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతిని వరంగల్ తూర్పు 28వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. 28వ డివిజన్ కార్పొరేటర్ గందే కల్పన నవీన్ ఆధ్వర్యంలో గురువారం అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి పూలదండ సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. జయంతి కార్యక్రమాల్లో భాగంగా డివిజన్‌లోని ఒక పేద విద్యార్థికి రూ.3,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సమాజంలోని నిరుపేదల అభ్యున్నతే అటల్ ఆశయమని నేతలు పేర్కొన్నారు.
అసాధారణ నాయకుడు వాజ్‌పేయి
ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు గందే నవీన్ మాట్లాడుతూ, అటల్ బిహారీ వాజ్‌పేయి అనేక అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొని దేశ చరిత్రలో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నిలిచిన అసాధారణ నాయకుడని కొనియాడారు. పార్లమెంటులో ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయినప్పుడు వెంటనే రాజీనామా చేసిన విలువల నేతగా ఆయన గుర్తుండిపోతారని అన్నారు. మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తొలి ప్రతిపక్ష నేతగా వాజ్‌పేయి దేశానికి విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. అదేవిధంగా ఐక్యరాజ్యసమితిలో తన వాగ్దాటితో పాకిస్తాన్‌పై గట్టిగా నిలిచిన గొప్ప దేశభక్తుడని ప్రశంసించారు. కార్యక్రమంలో గందే శ్రీనాథ్, బీజేపీ నాయకులు, వరంగల్ జిల్లా రజక సెల్ కన్వీనర్ కొత్తపెల్లి రాజేష్, డివిజన్ అధ్యక్షులు రామిని కృష్ణ, సుమన్, ఊట్ల అఖిల్, జూలూరి లోకేష్, పవన్, రాము, రమ్య, కళ్యాణి, కిరణ్, సదాశివుడు, విహారి రామ్, సాయి, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.


