కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూత్ టెస్టులో టీమిండియా అండర్-19 ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్ రెండో రోజు ఆటలో కేవలం 78 బంతుల్లోనే సెంచరీ బాది, ఆస్ట్రేలియా గడ్డపై యూత్ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 243 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, మొదటి బంతి నుంచి ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. కేవలం 86 బంతుల్లో 113 పరుగులు చేసిన ఈ యువ క్రికెటర్, తన ఇన్నింగ్స్‌లో 9 బౌండరీలు, 8 భారీ సిక్సర్లు బాదాడు. వరుసగా ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం మ్యాచ్‌లో హైలైట్‌గా మారింది.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వైభవ్ అనేక రికార్డులను తిరగరాశాడు. యూత్ టెస్టు చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. అయితే ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఇదే ఫాస్టెస్ట్. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆటగాడు లియామ్ బ్లాక్‌ఫోర్డ్ పేరిట ఉండగా (124 బంతుల్లో సెంచరీ), వైభవ్ 78 బంతుల్లోనే అది బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, కేవలం 14 సంవత్సరాలు 188 రోజుల వయసులో యూత్ టెస్టులో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు.
ఇదే కాకుండా, 100 బంతుల్లోపు రెండు సెంచరీలు చేసిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును కూడా వైభవ్ సమం చేశాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లో జరిగిన యూత్ టెస్టులో అర్ధశతకం సాధించి, వికెట్ కూడా తీయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైభవ్, మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. భారత యువ క్రికెటర్లలో ఒక నక్షత్రంగా వెలుగుతున్న వైభవ్ ప్రదర్శన, భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో అతని స్థానం పటిష్టం చేయవచ్చని నిపుణులు అంటున్నారు.


