- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు
కాకతీయ,గీసుగొండ: ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా పెరగాలంటే సమయానికి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు పిలుపు నిచ్చారు. గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ధర్మారం సబ్ సెంటర్, యుపిహెచ్సి కాశీబుగ్గలో నిర్వహించిన ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు టీకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ పుట్టిన నాటి నుంచి 16 సంవత్సరాల వయస్సు వరకు వ్యాధి నిరోధక టీకా వేయించుకోవడం ద్వారా బిడ్డలు అనేక వ్యాధుల నుంచి రక్షించబడతారన్నారు.
ప్రభుత్వం అందించే టీకాలన్నింటినీ తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు వేయించాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించడం, కాచి చల్లార్చిన నీరు తాగడం, వేడి ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో వ్యాధులను అరికట్టవచ్చని వివరించారు. గర్భిణులు, పిల్లలు పౌష్టికాహారం తీసుకొని రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది ప్రజల్లో వ్యాధులపై అవగాహన పెంచి, అవసరమైనచోట వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేయడంలో ఎవరు నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో అనిల్ కుమార్, వైద్య సిబ్బంది కిరణ్ కుమార్, సదానందం, స్థానిక ఏఎన్ఎం కళావతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


