ప్రజాబాటను వినియోగించుకోండి..
కాకతీయ, మరిపెడ : విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యుత్ ప్రజాబాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరిపెడ ఏడీఈఎం శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం మరిపెడ మండలంలోని అజ్మీర తండాలో, స్థానిక సర్పంచ్ అజ్మీర రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రజాబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల వద్దకే వెళ్లి విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సంబంధిత ఇబ్బందులను ప్రజాబాటలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. రైతులు స్వయంగా విద్యుత్ మరమ్మతులు చేసుకునే ప్రయత్నం చేయకూడదని, ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. మీటర్లు లేని వినియోగదారులు వెంటనే అధికారికంగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని, అక్రమంగా విద్యుత్ వినియోగించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అలాగే సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ మహమ్మద్, లైన్మెన్లు వెంకటేశ్వర్లు, బి. బికోజి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


