ప్రత్యేక వైద్య సేవలు వినియోగించుకోవాలి
డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్ రజిత
కాకతీయ, సిరిసిల్ల టౌన్: “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ఆరోగ్య కార్యక్రమం కింద జిల్లాలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత సూచించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు ఆమె తెలిపారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని, నిర్దేశిత తేదీల్లో నాలుగు దశలుగా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. మొదటి దశలో మార్చి 6 నుంచి మార్చి 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 8న గర్భాశయ క్యాన్సర్ నివారణకు మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 7న హనుమాజిపేట, 9న కోనరావుపేట, 10న లింగన్నపేట, 11న పోతుగల్, 12న విలాసాగర్, 13న ఎల్లారెడ్డిపేట, 14న పెద్దలింగాపూర్, 16న నేరెళ్ల, 17న తంగళ్లపల్లి, 18న కొదురుపాక, 20న సిరిసిల్లలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, 23న అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, 24న చీర్లవంచ, 25న బోయినపల్లి, 26న కోనరావుపేట, 28న పోతుగల్, 30న విలాసాగర్, 31న సిరిసిల్ల సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందిస్తామని డాక్టర్ రజిత తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.


