ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి
కాకతీయ, కరీంనగర్ : సైనికులు, వారి కుటుంబాలు ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు తణుకు మహేష్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు, జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని సైనిక్ వెల్ఫేర్ భవన్‌లో వీర్ పరివార్ సహాయతా యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు మహేష్ మాట్లాడుతూ, సైనిక్ వెల్ఫేర్ భవన్‌లో పదవీ విరమణ పొందిన, అంగవైకల్యం చెందిన, అలాగే విధుల్లో ఉన్న సైనికుల కుటుంబాల కోసం ప్రత్యేక న్యాయ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఒక న్యాయవాది, ఒక పారా లీగల్ వాలంటీర్ సేవలందిస్తూ ఉచిత న్యాయ సలహాలు, సహాయాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆస్తి వివాదాలు, పెన్షన్ సమస్యలు, ఇతర చట్టపరమైన అంశాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పూర్తిస్థాయి ఉచిత న్యాయ సహాయం లభిస్తుందని తెలిపారు. న్యాయ సలహాల కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 15100ను సంప్రదించాలని సూచించారు.కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, శాంతి కుమార్, అశ్విని, సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. మోహన్, జనరల్ సెక్రటరీ టి. శ్రీనివాస్ రెడ్డి తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


