హెచ్–1బీ వీసాదారులకు అమెరికా షాక్
సోషల్ మీడియా వెట్టింగ్‌తో ఇంటర్వ్యూలు వాయిదా
భారత్‌లోనే చిక్కుకున్న వందలాది మంది ఐటీ ఉద్యోగులు
కాకతీయ, నేషనల్ డెస్క్ : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది భారతీయ హెచ్–1బీ వీసాదారులు అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. వీసా రీన్యువల్ కోసం ఈ నెల ప్రారంభంలో భారత్‌కు వచ్చిన వారి కాన్సులర్ అపాయింట్‌మెంట్‌లను అమెరికా విదేశాంగ శాఖ అకస్మాత్తుగా వాయిదా వేసింది. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చి వరకు వాయిదా వేస్తూ ఈమెయిళ్లు పంపినట్లు బాధితులు వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసా అభ్యర్థులు జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పుగా మారే అవకాశం లేదని నిర్ధారించడమే లక్ష్యమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు నెలల తరబడి భారత్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్‌లో వందలాది క్లయింట్లు చిక్కుకుపోయారని ప్రముఖ ఇమిగ్రేషన్ లా ఫర్ములు వెల్లడిస్తున్నాయి. ‘‘ఇంతటి గందరగోళ పరిస్థితిని ఇప్పటివరకు చూడలేదు. దీనిపై స్పష్టమైన ప్రణాళిక కనిపించడం లేదు’’ అని ఇమిగ్రేషన్ న్యాయవాది వీణా విజయ్ ఆనంత్ వ్యాఖ్యానించారు. డెట్రాయిట్ సమీపంలో నివసిస్తున్న ఓ ఉద్యోగి పెళ్లి కోసం భారత్‌కు వచ్చి, డిసెంబర్ 17, 23 తేదీల్లో ఇంటర్వ్యూలు ఉండగా అవి రద్దుకావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, డిసెంబర్ 9న అమెరికా రాయబార కార్యాలయం జారీ చేసిన హెచ్చరిక కూడా కలవరం రేపుతోంది. అపాయింట్‌మెంట్ వాయిదా సమాచారం వచ్చినప్పటికీ పాత తేదీన కాన్సులేట్‌కు వెళ్తే ప్రవేశం నిరాకరిస్తామని స్పష్టం చేసింది. ఈ ఆలస్యాల నేపథ్యంలో ఉద్యోగ సంస్థలు ఎంతకాలం వేచి చూస్తాయన్న ఆందోళన ఉద్యోగుల్లో పెరుగుతోంది.
అమెరికాలో హెచ్–1బీ వీసాదారుల్లో 71 శాతం మంది భారతీయులేనని యూఎస్‌సీఐఎస్ నివేదిక చెబుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఉద్యోగులను విదేశీ ప్రయాణాలపై హెచ్చరిస్తూ, వీసా ప్రక్రియలో ఏడాది వరకు ఆలస్యం కావచ్చని సూచించాయి. దీంతో హెచ్–1బీ వీసాదారుల్లో భవిష్యత్‌పై అనిశ్చితి మరింత పెరిగింది


