22 నుంచి మొబైల్ యాప్ ద్వారా యూరియా
విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గింపు
పారదర్శకంగా యూరియా పంపిణీ లక్ష్యం
పంట విస్తీర్ణం ఆధారంగా బస్తాల కేటాయింపు
డీలర్లు, అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
గీసుగొండ మండల వ్యవసాయ అధికారి పి. హరిప్రసాద్ బాబు
కాకతీయ, గీసుగొండ : రైతులకు యూరియా సక్రమంగా, పారదర్శకంగా అందించడంతో పాటు ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ చేపట్టనున్నట్లు మండల వ్యవసాయ అధికారి పి. హరిప్రసాద్ బాబు తెలిపారు. ఈ నెల 22 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని చెప్పారు. ఈ మేరకు మండలంలోని కొనాయి మాకుల రైతు వేదికలో రైతులు, డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
యాప్ ద్వారా బుకింగ్ విధానం
పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులు తమ పాస్‌బుక్ నంబర్‌తో యాప్‌లో లాగిన్ కావచ్చని, పట్టా లేని రైతులు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలని వివరించారు. కౌలు రైతులు భూయజమాని పాస్‌బుక్ నంబర్‌తో పాటు మొబైల్ ధృవీకరణ అనంతరం యూరియా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. సాగు చేస్తున్న పంట విస్తీర్ణాన్ని బట్టి యూరియాను విడతలుగా తీసుకోవాలని సూచించారు. పంట విస్తీర్ణం ఆధారంగా గరిష్టంగా లభించే యూరియా బస్తాల సంఖ్యను యాప్ స్వయంగా లెక్కిస్తుందని తెలిపారు.
నిబంధనలు, జాగ్రత్తలు
ఒక విడత యూరియా తీసుకున్న తర్వాత తదుపరి బుకింగ్‌కు తప్పనిసరిగా 15 రోజుల వ్యవధి ఉండాలన్నారు. బుకింగ్ చేసిన 24 గంటల్లో సంబంధిత డీలర్ వద్ద యూరియా తీసుకోవాలని, నిర్ణీత సమయంలో తీసుకోకపోతే బుకింగ్ స్వయంగా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. డీలర్లు అప్రమత్తంగా ఉండి వాలంటీర్ల సహకారంతో రైతులకు యూరియా బుకింగ్ చేసి అందజేయాలని సూచించారు. గ్రామ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు యాప్‌పై రైతులకు అవగాహన కల్పించి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.


