రైతులకు తప్పని యూరియా తిప్పలు!
చలిలో గంటల తరబడి క్యూలు
మరిపెడలో యూరియా కోసం పోటీ
పోలీసుల నిఘాలో పంపిణీ.. రైతుల సహనానికి పరీక్ష
కాకతీయ, మరిపెడ : యూరియా కోసం రైతులు గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. గత పది రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులకు నేడు స్టాక్ రావడంతో ఎముకలు కొరికే చలిలోనూ ఆందోళనతో క్యూల్లో నిలబడ్డారు. రైతుల రద్దీ అధికంగా ఉండటంతో పోలీసులు అక్కడే ఉండి యూరియా పంపిణీని పర్యవేక్షించారు. పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నారు.
క్యూల్లో చెప్పులు పెట్టి నిరీక్షణ
యూరియా కోసం గంటల తరబడి నిలబడలేక కొంతమంది రైతులు తమ చెప్పులను క్యూలో ఉంచి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి. వృద్ధ రైతులు సైతం చలిని లెక్కచేయకుండా క్యూల్లో నిలబడి యూరియా బస్తాలు తీసుకుంటున్న దుస్థితి నెలకొంది. యూరియా కొరత నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ‘కంపాస్ కిసాన్’ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. రైతులు తాము సాగు చేస్తున్న పంట, ఎకరాల విస్తీర్ణం, అవసరమైన యూరియా వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే యాప్ ఉన్నప్పటికీ ఆశించిన మేర యూరియా అందడం లేదని రైతులు వాపోతున్నారు. యాప్ నమోదు, స్టాక్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పంటల కీలక దశలో యూరియా అందకపోతే దిగుబడులపై ప్రభావం పడుతుందన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేసి రైతుల కష్టాలకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


