యాప్‌తో రైతులకు సులభంగా యూరియా
ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మక అమలు
యాప్ పనితీరుపై రైతుల సంతృప్తి
రెండు రోజుల్లో 60,510 బస్తాల బుకింగ్
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కాకతీయ, హైదరాబాద్ : రైతులకు యూరియా సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత రెండు రోజుల్లో ఆదిలాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు లక్ష మందికి పైగా రైతులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. ఈ యాప్ ద్వారా మొత్తం 19,695 మంది రైతులు సమీప డీలర్ల వద్ద 60,510 యూరియా బస్తాలను బుక్ చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే 217 మంది కౌలు రైతులు కూడా 678 బస్తాలను బుక్ చేసుకున్నారని తెలిపారు.
రైతులకు లాభాలు
యాప్ ద్వారా తమ గ్రామానికి సమీపంలో ఉన్న డీలర్ల వద్ద యూరియా స్టాక్ వివరాలు తెలుసుకొని, కావలసిన పరిమాణాన్ని ముందుగానే బుక్ చేసుకునే సౌలభ్యం లభించిందని మంత్రి తెలిపారు. ఓటీపీ ద్వారా యూరియా పొందే విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారిందని, మొదట్లో ఎదురైన స్వల్ప సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించినట్లు చెప్పారు. యాప్ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతునేస్తం కార్యక్రమాల ద్వారా రైతులకు యాప్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ రబీ సీజన్‌కు రాష్ట్రానికి ఇప్పటికే 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందినట్లు పేర్కొంటూ, జనవరి–ఫిబ్రవరి నెలల్లో అవసరమయ్యే అదనపు యూరియాను ముందస్తుగానే తెప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.


