నగరాభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బల్దియా కమిషనర్ ప్రఫూల్ దేశాయ్
ఇంజనీరింగ్ పనులపై సుడిగాలి పర్యటన
రోడ్లు, పైపులైన్ పనుల తనిఖీ..
జనవరి 1లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఆయన నగరంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పలు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. మొదటగా నగరంలోని టవర్ సర్కిల్ సమీపంలో ఇటీవల వేసిన బీటీ రోడ్డు పనులను తనిఖీ చేసి, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం అమరవీరుల స్థూపం సమీపంలో మంచి నీటి సరఫరా పైపులైన్ లీకేజీ మరమ్మతు పనులను పరిశీలించి, వెంటనే లీకేజీ అరికట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఐడీఎస్ఎంటీ టీ భవనం ఆధునీకరణ పనులను పరిశీలించిన కమీషనర్, జనవరి 1లోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే మానేరు డ్యాం సమీపంలో నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఇరువైపులా నాటిన పండ్ల మొక్కలు, ఓపెన్ జిమ్‌ను తనిఖీ చేశారు. వాకింగ్ ట్రాక్‌పై స్టోన్ డస్ట్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని ఆదేశించారు. ఓపెన్ జిమ్‌లో చెడిపోయిన పరికరాలను త్వరితగతిన రిపేర్ చేసి వాకర్లకు సౌకర్యం కల్పించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల స్థూపం సమీపంలోని మంచి నీటి పైపులైన్ 30 సంవత్సరాల క్రితం వేసినదైనందున తరచూ లీకేజీలు జరుగుతున్నాయని, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానేరు డ్యాం నుంచి వచ్చే సీఫేజీ వాటర్‌ను కచ్చనాల ద్వారా మళ్లించేలా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా సప్తగిరి కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి, భవన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ సంజీవ్‌కుమార్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


