బీజేపీతోనే నగరాభివృద్ధి
వరంగల్ అభివృద్ధిపై కేంద్రం నజర్
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడం అభినందనీయం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
కాకతీయ, వరంగల్ సిటీ : బీజేపీతోనే నగరాభివృద్ధి సాధ్యమని, వరంగల్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. గ్రేటర్ వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కి నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం గ్రేటర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ… గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ భారీగా నిధులు కేటాయిస్తున్నారని, ఈ పథకం కింద 5257.20 కోట్లతో చేపట్టే పనులకు పాలనపరమైన అనుమతి మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు. కేంద్రం భారీగా నిధులు ఇస్తున్న ఖర్చు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అవుతున్నారని పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గంట రవికుమార్ అన్నారు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ మంజూరు చేసిన కేంద్రం, తాజాగా అండర్ డ్రైనేజీకి నిధులు మంజూరు చేసిందని, ఇప్పటికే స్మార్ట్ సిటీ లో భాగంగా అనేక నిధులు ఇచ్చి నగరం రూపురేఖలు మార్చిందని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు తప్ప అభివృద్ధి చేసింది లేదని విమర్శించారు. ఓట్ల కోసం ఇచ్చే హామీలు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకున్న దాఖలు లేవని దుయ్యబట్టారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, ప్రత్యేక వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బిజెపి కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, బైరి నాగరాజు జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బిజెపి నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.


