- అప్పుడు యూరియా కోసం లైన్లు
- ఇప్పుడు పంట కాపాడుకోవడానికి కన్నీళ్లు
- కరీంనగర్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం
కాకతీయ, కరీంనగర్ : వర్షాకాలం రైతులకు పరీక్షగా మారింది. కరీంనగర్ జిల్లాలో కొన్ని వారాల క్రితమే యూరియా కోసం గంటలకొద్దీ క్యూలలో నిలబడ్డ రైతులు, ఇప్పుడు అకాల వర్షాల బారిన పడి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని అనేక మండలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నీటమునిగిపోయాయి. వరి, పత్తి, మక్క, మిర్చి పంటలు తడిసి నేలకొరిగి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. “యూరియా కోసం క్యూలు కట్టాం… ఇప్పుడు పంట కోసం కన్నీరు పెడుతున్నాం” అని బాధతో చెబుతున్నారు రైతులు. వర్షపు నీటిలో పొలాలు మునిగిపోవడంతో పంట నష్టం అధికమైందని, ప్రభుత్వం తక్షణమే పంట బీమా, పరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


