మేడారంలో కనిపించని పారిశుద్ధ్యం!
ఆలయం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త కుప్పలు
ప్లాస్టిక్, జంతు అవశేషాలతో దుర్వాసన
ముందస్తు భక్తుల రాకతో పెరిగిన అవస్థలు
పారిశుద్ధ్య యంత్రాంగంపై భక్తుల ఆగ్రహం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఏటా లక్షలాది భక్తులను ఆకర్షించే ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈనెల 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. జాతరకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండగానే ముందస్తుగా లక్షల సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తుండగా… పారిశుద్ధ్య వ్యవస్థ మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేడారం ఆలయం పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, గాజు సీసాలు, ఆహార అవశేషాలు, జంతు వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయాయి. రహదారుల పక్కన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కుళ్లిపోవడంతో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ చెత్త తొలగింపు మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
కనిపించని పారిశుద్ధ్య యంత్రాంగం
జాతరకు ఇంకా సమయం ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే… అసలు జాతర రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయం చుట్టూ, భక్తులు బస చేసే ప్రాంతాల్లో చెత్త తొలగింపు, మురుగు కాలువల శుభ్రత, ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. వ్యర్థాలను పూర్తిగా తొలగించకుండా కేవలం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ పైపై పనులు చేయడం వల్ల మరింత దుర్గంధం వ్యాపిస్తోందని భక్తులు మండిపడుతున్నారు. మేడారం జాతరలో మొక్కులు తీర్చుకునే భాగంగా కోళ్లు, మేకలు బలి ఇచ్చే ఆచారం ఉంది. అయితే బలి అనంతరం జంతు అవశేషాలను సకాలంలో తొలగించకపోవడంతో అవి ప్రదేశం అంతా చెదురుమదురుగా పడిపోతున్నాయి. రెండు మూడు రోజులు అలాగే ఉండిపోతున్న ఈ కళేబరాల వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెదురు ఈగలు, దోమలు పెరిగి అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న అధికారులు… భక్తులకు అత్యంత ప్రాథమికమైన పారిశుద్ధ్యాన్ని మాత్రం విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచడం, రోజువారీ చెత్త సేకరణ, ప్రత్యేక సానిటేషన్ బృందాల ఏర్పాటు, ప్లాస్టిక్ నిషేధంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ నేతల విమర్శ
మేడారం పరిసరాలు దుర్గంధం వెదజల్లుతున్నాయని బీజేపీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. ముందస్తు భక్తులకు అనుగుణంగా పారిశుద్ధ్య పనులు జరగటం లేదని, ఎక్కడ చూసినా వ్యర్థాలు కుళ్లిపోయి చెడు వాసన వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కలగజేసుకుని ప్రత్యేక పారిశుద్ధ్య వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యర్థాలను తొలగించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


