‘శంబాల’ షూటింగ్‌లో అనుకోని ప్రమాదం
కాకతీయ, సినిమా : సాధారణ సినిమాలు తెరకెక్కించడమే సవాలుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, అడ్వెంచర్ నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించడం మరింత కష్టసాధ్యంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో యంగ్ హీరో ఆది నటిస్తున్న అవైటెడ్ సినిమా ‘శంబాల’ షూటింగ్‌లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో హీరో ఆది గాయపడినట్లు చిత్ర బృందం తెలిపింది. రాత్రి పూట జరిగిన ఈ షూటింగ్‌లో పలువురు నటీనటులు పాల్గొన్నారు. యాక్షన్ సీన్ చేస్తుండగానే ఆదికి గాయాలు అయినప్పటికీ, షూటింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఆ రాత్రి షెడ్యూల్‌ను పూర్తి చేశారని టీం వెల్లడించింది. గాయాల మధ్యన కూడా సినిమా పట్ల తన అంకితభావాన్ని ఆది చూపించారని చిత్ర యూనిట్ ప్రశంసించింది. ఇప్పటికే డీసెంట్ బజ్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. యగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అడ్వెంచర్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘శంబాల’ చిత్రాన్ని డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


