కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్‌లో కొరియర్, కార్గో, పార్సెల్ సెంటర్లలో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్వయంగా పర్యవేక్షించారు. తనిఖీలలో నిషేధిత వస్తువుల అక్రమ రవాణా గుర్తించేందుకు శిక్షణ పొందిన పోలీసు కుక్కలు ‘రాంబో’, ‘లియో’, ‘మైకి’ ‘టైసన్’ సహకారంతో కిసాన్ నగర్, బొమ్మకల్ చౌరస్తా, హౌసింగ్ బోర్డు కాలనీ, రాంనగర్, ముఖరాంపుర, జ్యోతి నగర్, కాశ్మీర్ గడ్డ, గోదాం గడ్డ తదితర ప్రధాన ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కొరియర్, కార్గో మార్గాల ద్వారా నిషేధిత మాదక ద్రవ్యాలు, గంజాయి, ఫైర్ ఆర్మ్స్ అక్రమంగా రవాణా అవుతున్నందున ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు నిర్వహింమని అన్నారు. ప్రజలు అనుమానాస్పద పార్సెల్స్ లేదా కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, జాన్ రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


