కాకతీయ, నేషనల్ డెస్క్: బ్రిటన్‌లో భారత సంతతి ప్రజలపై జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఓల్డ్‌బరీ పట్టణంలో 20 ఏళ్ల సిక్కు యువతి అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి రావడంతో అక్కడి భారతీయ సమాజం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇద్దరు శ్వేతజాతీయ దుండగులు యువతిపై దాడి చేసి, జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ మీ దేశానికి తిరిగి వెళ్లిపో అని అరిచినట్లు తెలుస్తోంది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ సంఘటన గత మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో టేమ్ రోడ్ సమీపంలో జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు దీనిని సాధారణ నేరంగా కాకుండా జాత్యహంకార ప్రేరేపిత దాడిగా నమోదు చేశారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒకరు ముదురు రంగు స్వెట్‌షర్ట్, మరొకరు గ్రే కలర్ టాప్ ధరించి ఉన్నారని గుర్తించారు.
ఈ ఘటనపై స్థానిక సిక్కు సమాజం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో అదనపు పోలీస్ బలగాలను మోహరించి, పెట్రోలింగ్‌ను పెంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. “సమాజంలో భయం పుట్టకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటాము” అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీలు కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. బర్మింగ్‌హామ్ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ మాట్లాడుతూ.. ఇది కేవలం హింస కాదు, మానవత్వంపై మచ్చ. బాధితురాలు ఈ దేశానికి చెందనట్టు దుండగులు అన్నా, ఆమె కూడా ఈ నేలదే. ప్రతి ఒక్కరికీ గౌరవంగా, సురక్షితంగా జీవించే హక్కు ఉంది. బ్రిటన్‌లో జాత్యహంకారానికి స్థానం లేదు” అని పేర్కొన్నారు.
మరో ఎంపీ జస్ అత్వాల్ ఈ ఘటనను హేయమైన, స్త్రీ ద్వేషపూరిత దాడి”గా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న జాత్యహంకార ఉద్రిక్తతల వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఈ అమానుష దాడి బాధితురాలికి జీవితాంతం మానసిక క్షోభ మిగులుస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నెల రోజుల క్రితం వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధ సిక్కులపై ముగ్గురు టీనేజర్లు దాడి చేసిన ఘటన మరవకముందే, మరోసారి సిక్కు సమాజం లక్ష్యంగా మారడం స్థానికులలో ఆందోళన రేపుతోంది. ఈ సంఘటనలపై యూకే ప్రభుత్వానికి కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ సమాజం డిమాండ్ చేస్తోంది.


