యూజీసీ నిబంధనలు అమలు చేయాలి
కాకతీయ, కరీంనగర్: దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సమ్మె ర్యాలీలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, ప్రజా, యువజన, విద్యార్థి వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. నూతన విద్యా విధానం ద్వారా విద్యారంగంలో కుల, మత ప్రాధాన్యతలను పెంపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. నూతన విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
యూజీసీ సమానత్వ మార్గదర్శకాలను అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని, విద్యాసంస్థల్లో కుల వివక్షత ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కంపెళ్లి అరవింద్, జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, రాకేష్ పాల్గొన్నారు.


