ద్విచక్ర వాహన చోరీల ముఠా గుట్టురట్టు
నలుగురు మైనర్లతో పాటు ఏడుగురు అరెస్టు
రూ.15 లక్షల విలువైన 15 బైకులు స్వాధీనం
వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోనూ చోరీలు
టెక్నాలజీ సహాయంతో నిందితుల గుర్తింపు
వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితో పాటు హైదరాబాద్ నగరంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను సంగెం పోలీసులు గురువారం అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు ఉండగా, వారిలో నలుగురు మైనర్లు ఉన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన మేజర్ నిందితులు దరాంగుల అంజీ, జైదా రామకృష్ణ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వివరాల ప్రకారం, ఒకే ప్రాంతానికి చెందిన ఈ యువకులు స్నేహితులుగా తిరుగుతూ మద్యం సేవలకు అలవాటు పడ్డారు. వారి ఖర్చులకు డబ్బు సరిపోకపోవడంతో సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో పార్క్ చేసి తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. చోరీ చేసిన వాహనాలను హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో రహస్యంగా దాచేవారు. నిందితులు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, సంగెం, హసన్‌పర్తి, మిల్స్ కాలనీ స్టేషన్ల పరిధిలో రెండేసి, ధర్మసాగర్లో ఒకటి, హైదరాబాద్ మడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 1న సంగెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాలపల్లి గ్రామంలో జరిగిన ద్విచక్ర వాహన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీ సహాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు గవిచర్ల గ్రామంలోని గుండు సమ్మయ్య ఆలయం వద్ద వాహన తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు నిందితులు ప్రయాణిస్తున్న చోరీ వాహనాలను పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించడంతో పాటు వారి సమాచారం మేరకు పద్మాక్షమ్మ గుట్ట ప్రాంతంలో దాచిన మిగిలిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చోరీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ వెంకట్, సంగెం సీఐ, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.


