ద్విచక్ర వాహనాల చోరీ గ్యాంగ్ అరెస్టు
రూ.11 లక్షల విలువ చేసే 17 బైకులు స్వాధీనం
వివరాలు వెల్లడించిన టౌన్ ఏసీపీ రమణమూర్తి
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను అరెస్టు చేసి భారీగా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస బైక్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శుక్రవారం వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసులో మొత్తం 7 మందిని అరెస్టు చేయగా, మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.11 లక్షల విలువ చేసే 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో కొండమీద యోగీశ్వర్ (19), మేడ సాయి కుమార్ (27)తో పాటు మరో నలుగురు మైనర్లు ఉన్నారు. రిసీవర్లుగా ముద్దంగుల నరేష్‌ను అరెస్టు చేయగా, షేక్ హరీఫ్, నునావత్ వినోద్ పరారీలో ఉన్నారు. దొంగిలించిన వాహనాలను తక్కువ ధరలకు మెకానిక్స్, ఇతరులకు విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో మరికొందరు రిసీవర్లను గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


