బాలుడి మృతికి కారణమైన ఇద్దరికి ఏడేళ్లు జైలు
మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు
కాకతీయ, ఖమ్మం : బాలుడు మృతికి కారణమైన ఇద్దరికీ ఏడేళ్లు జైలు శిక్ష విదిస్తూ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే 2022 ఆగస్టు 21న
కల్లూరు మండలం శాంతినగర్ కాలనీలో కంచపోగు పెద్ద సత్యం ఇంట్లో జరుగుతున్న పెండ్లి శుభకార్యానికి ఫ్లడ్లైట్స్ కోసం విద్యుత్ స్తంభం నుండి లాగిన సర్విస్ వైరును నిర్వక్ష్యంగా కిందకు వదిలేయడంతో విద్యుత్ షాక్‌తో కొత్తపల్లి రాణా హుస్సేన్ (8) మరణించారు. తన కుమారుడి చావుకు కారకులైన కంచపోగు పెద్ద సత్యం, కంచపోగు నరేష్, కంచపోగు లక్ష్మయ్య (ఎలక్ట్రిషియన్) పై తగు చర్యలు తీసుకోవాలని తల్లి కొత్తపల్లి సుజాత కల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి ఏ2 కంచపోగు నరేష్ మృతి చెందటంతో ఏ1 కంచపోగు పెద్ద సత్యం, ఏ3 కంచపోగు లక్ష్మయ్యకు జైలు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కు సహకరించిన అప్పటి దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ సి.హెచ్. హనోక్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. శరత్ కుమార్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ పి. జ్యోతిబసు, ఎస్సై కె. శ్రీకాంత్, హోంగార్డ్
మహమ్మద్ అయూబ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.


