కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దునూరు గ్రామ శివారులో 2021లో జరిగిన దుర్గయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవితఖైదు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నారాయణ తీర్పు వెలువరించారు. కాగా ఈ కేసు సంబంధించిన వివరాలును జిల్లా ఎస్పీ అశోక్ కూమార్ మీడియాకు వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన సూర దుర్గయ్య (60) అదే గ్రామంలో బండ కొట్టే పనులతో జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన దారంగుల రాజు, దారంగుల రాజేశం అన్నదమ్ములతో పాత గొడవలు ఉండేవి. 2021 ఫిబ్రవరి 19న మద్యం సేవించి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన దుర్గయ్య ఆ రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు మద్దునూరు గ్రామ శివారులోని గుట్టల వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించారు.
దుర్గయ్యను ముఖం, తలపై బండరాయితో కొట్టి, గాజు సీసాలతో పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడి కుమారుడు సూర శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన రాజు, రాజేశంలను అరెస్టు చేసి కోర్టులో హజరుపరచారు. దీర్ఘ విచారణ అనంతరం, కేసుకు సంబంధించి సమర్పించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తి రాజు, రాజేశంకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్బంగా ఏస్పీ మాట్లడుతూ. నేరం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.


