కాకతీయ, నేషనల్ డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్నానేశ్ కుమార్ వెల్లడించారు. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం
మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న జరగనుంది.
రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న నిర్వహించబడుతుంది.
ఫలితాలు నవంబర్ 14న ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఇందులో మొదటి దశలో 121 స్థానాలు, రెండవ దశలో 122 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
ఎన్నికల ప్రకటనతో బీహార్‌లోని రాజకీయ పార్టీలు చురుగ్గా కదలికలు మొదలుపెట్టాయి. ముఖ్యంగా జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ , కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, కూటములు, కొత్త నాయకుల ఎంట్రీ వంటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి.
ఎన్నికల కమిషన్ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అధికారులు ఎన్నికల ఏర్పాట్లను ప్రారంభించారు. భద్రతా దళాల మోహరింపు, ఓటర్ లిస్ట్ ఖరారు, పోలింగ్ సెంటర్ల సిద్దత వంటి ప్రక్రియలు వేగంగా జరుగుతున్నాయి.
బీహార్‌లో రాజకీయ పరిస్థితులు ఈసారి ఆసక్తికరంగా మారాయి. జేడీయూ-బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందా, లేక ఆర్జేడీ కూటమి తిరిగి రాణిస్తుందా అన్నది ప్రజల ఓటుతో తేలనుంది. నవంబర్ 14న వెలువడే ఫలితాలపై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది.


