టీయుడబ్ల్యూజే పోరాటం ఫలించింది
అక్రిడిటేషన్ జీవో సవరణపై జర్నలిస్టుల్లో హర్షం
డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులు : కల్లోజి శ్రీనివాస్
కాకతీయ, కొత్తగూడెం రూరల్: జర్నలిస్టులను విభజించేలా గతంలో తీసుకొచ్చిన అక్రిడిటేషన్ కార్డుల జీవోపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని టీయుడబ్ల్యూజే (టీజేఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్ షఫీ, రాష్ట్ర కమిటీ సభ్యులు చండ్ర నరసింహారావు, వట్టి కొండ రవిలతో కలిసి ఆయన మాట్లాడారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన 252 జీవో జర్నలిస్టులకు నష్టం కలిగిస్తుందని భావించి, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపు మేరకు పాత్రికేయులు జిల్లా కలెక్టరేట్ ముందు భారీ నిరసన చేపట్టారని గుర్తుచేశారు. ఆ పోరాట ఫలితంగానే ప్రభుత్వం జీవోను సవరించి డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని పేర్కొందన్నారు. డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్లో మహిళలకు 33 శాతం కేటాయింపును స్వాగతిస్తున్నామని, అయితే ఎన్ని కార్డులు జారీ చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిట్ ఉన్న జిల్లాలకే పరిమితం కాకుండా అన్ని జిల్లాలకు అవకాశం కల్పించాలని, కార్డుల సంఖ్య తగ్గించకుండా అర్హులందరికీ మంజూరు చేయాలని కోరారు. జీవో సవరణ టీయుడబ్ల్యూజే సాధించిన విజయమని నాయకులు పేర్కొన్నారు.


