టీయూడబ్ల్యూజే 2026 మీడియా డైరీ ఆవిష్కరణ
కాకతీయ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) ఆధ్వర్యంలో ముద్రించిన 2026 నూతన సంవత్సర మీడియా డైరీని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మంగళవారం తన కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌస్ అలాం మాట్లాడుతూ, సమాజంలో మీడియా పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని అభినందించారు. “శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరం. మీడియాతో పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ సానుకూల సంబంధాలు ఉంటాయి” అని తెలిపారు.
అలాగే ఉపయోగకరమైన సమాచారంతో, పక్కాగా రూపకల్పన చేసిన మీడియా డైరీని ముద్రించిన టీయూడబ్ల్యూజే నాయకులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. జర్నలిస్టుల వృత్తి పరమైన అవసరాలకు ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకటేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ఊరడి రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలిగేటి శ్రీనివాస్, కంకణాల రఘు, రేగుల నర్సింగం, జి. కేశవరెడ్డి, ఎండీ మోసిన్ తదితరులు పాల్గొన్నారు.


