అభివృద్ధికి మారుపేరు తుమ్మల
ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం
ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా తీరు మారలేదని విమర్శ
వెలుగుమట్లలో అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తామని హామీ
కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు నరసింహారావు
కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు సాదు రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ప్రతిపక్షాలు అనవసరంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి అంటేనే తుమ్మల అని, ఆయన మచ్చలేని నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా ప్రతిపక్షాల తీరు మారలేదని ఆరోపించారు. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొందరు దళారులు పేదల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి అక్రమంగా ప్లాట్లు కట్టబెట్టారని అన్నారు. అర్హులైన పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే నిర్వహించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో మంత్రులుగా ఉన్న నేతలు భూదాన్ భూముల్లో పేదలకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులేనని, వాటిని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ బెడద సత్యనారాయణ, దొడ్డా అశోక్, తాళ్లూరి హనుమంతరావు, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, సేవాదళ్ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.


