టగ్ ఆఫ్ వార్
మూడు పార్టీల మధ్య మునిసిపల్ ఫైట్
హుజురాబాద్, జమ్మికుంటలో జెండా ఎగురవేసేది ఎవరు..?
అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ..చాకచాక్యంగా ప్రణవ్ పావులు
ఉత్త లీడర్‌ను కాదు..ఉనికి ఉన్న లీడర్నని చాటుకోవాలని కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు కమలం అగ్రనేతల దృష్టి
కమలదళంలో వర్గపోరుతో..క్యాడర్లో కొంత గందరగోళం
పట్టువిడవని ఈటల.. పట్టుబడుతున్న కేంద్ర మంత్రి బండి
ఆసక్తికరంగా హుజురాబాద్, జమ్మికుంట మునిసిపల్ ఎన్నికలు
కాకతీయ, హుజురాబాద్/ జమ్మికుంట : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు సాగిస్తుండగా.. స్థానిక బీఆర్ ఎస్ ఎమ్మెల్య కౌశిక్ రెడ్డి అండదండలతో మునిసిపల్‌పై గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. ఇక ఇదే నియోజకవర్గంపై 25 ఏళ్లు తన రాజకీయ ప్రస్థానం.. ఎదుగుదలను చాటుకున్న మాజీమంత్రి, ప్రస్తుత మల్కాజిగిర ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సైతం ఫుల్ ఫోకస్ పెట్టారు. బీజేపీలో కొంత అంతర్గత వర్గ రాజకీయం జోరుగా సాగుతుండటంతో..ఆ పార్టీ నుంచి టికెట్ల కోసం పోటీ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అదే సమయంలో అంతర్గత పోరు.. ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనన్న టెన్షన్ కూడా ఆశావహుల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం.

వొడితల ప్రణవ్ అంతా తానై..!
కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వొడితల ప్రణవ్ జమ్మికుంట, హుజురాబాద్ మునిసిపాలిటీలను గెలిపించుకుని రాజకీయంగా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో నియోజవర్గంలోని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ నేపత్యంలో తన రాజకీయ భవిష్యత్‌కు.. హుజురాబాద్ నియోజకవర్గంలో తనదే పై చేయి అనే సంకేతం ఇచ్చేందుకు ఈ ఎన్నికలను యువ నాయకుడు చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం గమనార్హం. రెండు మునిసిపాలిటీలపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు, ఆశావహులకు టికెట్ల కేటాయింపు అంశాన్ని పూర్తిగా ప్రణవ్‌కే అప్పగించినట్లుగా తెలుస్తుండటంతో.. ఆయన చుట్టూ నేతలు ప్రదిక్షణలు చేస్తున్నారు. అయితే ఈ మునిసిపల్ ఎన్నికలతో తన రాజకీయ భవిష్యత్ కూడా ముడిపడి ఉండటంతో ఆచితూచి..వేచిచూస్తూ…పరిణామాలను, సమీకరణాలను లెక్కవేసుకుంటూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

పాడి కౌశిక్ రెడ్డి ఉనికి చాటేనా..!
హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్‌రెడ్డికి ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవిగా చెప్పాలి. ప్రజలను బెదిరించి ఎమ్మెల్యేగా గెలిచాడంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు సూసైడ్ స్టార్ అంటూ అనేక మార్లు వ్యగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో ఆయన పొలిటికల్ స్టామినా ఏంటో చాటాల్సిన అవసరం ఉందన్న చర్చ ఆయన అభిమానుల నుంచే వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలాన్ని, ఈ నియోజకవర్గంపై విశేషమైన అవగాహన, పరిచయాలు ఉన్న బీజేపీ ఎంపీ ఈటలను హుజురాబాద్, జమ్మికుంట పట్టణ ఓటర్లను తన వైపు తిప్పుకోవడం అన్నది అంత ఈజీ కాదన్న విశ్లేషణ ఓ వైపు వినిపిస్తుండగా.. ఖచ్చితమైన బీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో రెండు మునిసిపాలిటీలపై జెండా ఎగురవేయగలమన్న ధీమాను ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తుండటం విశేషం. అయితే రెండు మునిసిపాలిటీల గెలుపోటములకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డినే బాధ్యుడిగా చేసే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికలు కౌశిక్‌రెడ్డికి అత్యంత కీలకంగా మారనున్నాయి. గెలిస్తేనే భవిష్యత్.. ఓడితే నిందలు, బలహీన నాయకుడేనన్న చర్చకు మరింత బలం చేకూర్చే అవకాశం ఉంటుందన్న విశ్లేషణ ఆ పార్టీ క్యాడర్లో జరుగుతోంది.
బీజేపీలో బాధ్యత ఎవరికీ..! ఈటల, బండి పోటాపోటీ..!
బీజేపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈనియోజకవర్గంపై పట్టెవరిది..? పట్టింపు ఎవరికి.?టికెట్లు పంచేది ఎవరు..? క్యాడర్‌ను కూడకట్టేది ఎవరు అన్నది అస్పష్టంగా మారింది. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీగా, రాష్ట్ర బీజేపీలో అగ్రనేతగా తన పూర్తి ప్రభావం ఉండాలని బండి సంజయ్‌కుమార్ భావిస్తున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించేందుకు తన అనుచరగణాన్ని, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వంటి నేతలతో పావులు కదుపుతున్నారు. టికెట్ల వ్యవహారమంతా కూడా తన కనుసన్నల్లోనే ఉంటుందని సంకేతాలు బండి సంజయ్ పంపుతున్నారు.ఇది ఇలా ఉండగా.. తన సొంత నియోజకవర్గం, 25ఏళ్లు తాను పాలించిన నియోజకవర్గంలో వేరేవరికి చోటువ్వనన్నట్లుగా ఎంపీ ఈటల వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఎంత జిజ్జుకైనా సిద్ధమేనన్నట్లుగా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. హుజురాబాద్ గడ్డ నా అడ్డా.. ఇక్కడ టికెట్లు ఇచ్చేది నేనే.. గెలిపించుకునేది నేనే నంటూ తన ఆధిపత్య హక్కును ఘాటుగా వెల్లడించారు. ఇద్దరు అగ్రనేతల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్తో ఇప్పుడు జమ్మికుంట, హుజురాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలు ఎంత అన్నది..? ప్రశ్నగా మిగులుతోంది. విడివిడిగా కన్నా.. సయోధ్యతో ఎన్నికల రణరంగంలోకి దిగితే.. అధికార పార్టీ సమీకరణాలను, బీఆర్ఎస్ అంచనాలను పటా పంచలలు చేస్తూ విజయాన్ని ముద్దాడవచ్చనంటూ పార్టీ సీనియర్లు రాజకీయ సలహా ఇస్తున్నారు.


